మనదైన చరిత్ర

అలెక్జాండర్ విశ్వవిజేత కాదు, మన రాజు పురుషోత్తముడి చేతిలో ఓడిపోయాడు”
(దీనికి ఆధారాలు ఈ వ్యాసంలో ఉన్నాయి, చదవగలరు)
విజయగాథల మీద ఆధారపడి నిర్మితమైన సంస్కృతి అసాధారణ ఫలితాలనిస్తుంది, అది మహోన్నత చరిత్రను సృష్టిస్తుంది. అయితే నేటి విద్యార్థులకు మనం ఎలాంటి చరిత్రను చెబుతున్నాం. మనదైన చరిత్రపై వారికి అవగాహన లేదు. వ్యాపారం పేరుతో వచ్చి, మోసంతో మన దేశాన్ని ఆక్రమించుకున్న ఆంగ్లేయులు మనదైన ప్రతి వ్యవస్థనీ నాశనం చేశారు. మన చరిత్రనీ వక్రీకరించారు. మనది పరాక్రమ చరిత్ర కాదు, పరాజయ చరిత్రే అని అసత్యాలను వ్యాపింపజేశారు. బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తరువాత కూడా ఆ చరిత్ర పాఠాలనే కొనసాగిస్తూ వచ్చారు. మరి మనలో స్వాభిమానం ఎలా నెలకొంటుంది?
గర్వదాయకమైన మన వీరుల చరిత్రను పిల్లలకి పాఠాలుగా బోధించినపుడే మన సమాజంలో “చరిత్రను సృష్టించే వీరులు” తయారవుతారు. శివాజీకి జిజియామాత బాల్యంలోనే రామాయణ, మహాభారత గాధలు, చరిత్రలోని స్ఫూర్తివంతమైన కథలు చెప్పింది కాబట్టే ఆయన అంత గొప్ప వాడయ్యాడు. మన విద్యార్థుల్లో దేశభక్తి పెంచే విధంగా చరిత్ర రచన కొనసాగాలి. మనదేశ చరిత్రని గమనించినట్టయితే కొన్ని విషయాలు స్పష్టమవుతాయి.
1. మనం ఎప్పుడైతే ఐక్యంగా ఉన్నామో అప్పుడు మనమీదకి దండెత్తి వచ్చిన వారిని తిప్పిగొట్టగలిగాం.
2. శక్తి ఉన్నా మన సమాజంలో ఐక్యత లోపించినప్పటి నుండీ మనదేశం మీదకి దండెత్తి వచ్చినవారి చేతిలో మనం ఓడిపోతూ వచ్చాం.
3. మన దేశంలో అడుగుపెట్టిన అరబ్బులు, తురష్కులు, మొఘలులు మొదలగువారంతా ఏనాడూ మన దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోలేకపోయారు. దేశంలో ఏదో ఒక మూల ప్రతినిత్యం దురాక్రమణదారులకు ప్రతిఘటన ఎదురవుతునే ఉంది. భారతీయ వీరుల నుండి తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం వారు కంటిమీద కునుకులేకుండా అవస్థలు పడ్డారు.
4. మన ధర్మం, సంస్కృతులను నాశనం చేయడానికి విదేశీయులు ఎంతగా ప్రయత్నించినా ఈనాటికీ అవి చెక్కుచెదరకుండా వున్నాయి.
మన దేశ చరిత్ర మనపైకి దండయాత్ర చేసిన వారి చరిత్రగా ఉందే కానీ, వాళ్లతో యుద్ధాలు చేసి, త్యాగాలు చేసిన భారతీయుల చరిత్రగా లేదు. విదేశీయులను మనవారు ఓడించిన చాలా సందర్భాలను గురించి ప్రస్తావన మన చరిత్ర పాఠాలలో లేదు. మనమీదకి దండెత్తి వచ్చినవారు శక్తివంతులు, మనం శక్తిహీనులం అనే ఆలోచన విద్యార్థుల్లో కలిగే విధంగా నేడు చరిత్ర బోధన కొనసాగుతోంది.
నిజానికి మనది పరాజిత చరిత్ర కాదు. “పరాక్రమ చరిత్ర”. దానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం.
క్రీ.పూ 327 సంవత్సరంలో జీలం నది ఒడ్డున జరిగిన యుద్ధంలో అలెగ్జాండర్ పురుషోత్తముని ఓడించినట్టుగా మన పాఠ్యపుస్తకాలలో ఉంది. ప్రొఫెసర్ హరిశ్చంద్ర సేథ్ (లండన్) 1938లో జరిగిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌లో సమర్పించిన ‘వాజ్ పోరస్ ది విక్టర్ ఆఫ్ ది బాటిల్ ఆఫ్ జీలం?’ అన్న వ్యాసంలో పురుషోత్తముడే అలెగ్జాండర్‌ని ఓడించాడని పేర్కొన్నాడు. ఇందుకు భారతదేశంలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని, ఐరోపా చరిత్రకారుల వ్రాతల ఆధారంగానే ఈ విషయం స్పష్టం అవుతుందని సేథ్ చెప్పారు. కుర్టిడయస్, జస్టిన్, డయోడరస్, అరియన్, ప్లూటార్క్ అనే ఐరోపా చరిత్రకారులు వ్రాసినవి చూస్తే అలెగ్జాండర్ పురుషోత్తముని చేతిలో ఓడిపోయి అతనితో సంధి చేసుకుని ఈ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయాడన్న విషయం స్పష్టమవుతుంది.
ప్లూటార్క్ కథనం ప్రకారం : “ఒకలక్షా ఇరవై వేల మంది పదాతిదళంతో 15వేల మంది అశ్విక దళంతో మన దేశం మీదకి అలెగ్జాండర్ దండెత్తి వచ్చాడు. పురుషోత్తముని పట్ల శత్రుత్వం వహించిన తక్షశిల రాజు అంభి సహాయం కూడా అతనికి ఉంది. పురుషోత్తముని వద్ద 20వేల మందితో కూడిన పదాతిదళం, 2 వేల మంది గల అశ్విక దళం మాత్రమే ఉంది. పురుషోత్తముని సైనికులు సాటిలేని మేటి వీరులు. వారితో పోరాడి గెలవడం అసాధ్యమని యుద్ధం ప్రారంభంలోనే అలెగ్జాండర్ సైనికులు గ్రహించారు”.
కుర్టియస్ ఇలా వ్రాస్తాడు : “జీలం నదిలో ఒక దీవిలో విడిది చేసిన అలెగ్జాండర్ సైనికుల మీదకి పురుష్తోముడు దాడి చేస్తాడు. ఆ దాడిలో చాలామంది గ్రీకు సైనికులు మరణిస్తారు. పురుషోత్తముని ధాటికి తాళలేక చాలామంది గ్రీకు సైనికులు తప్పించుకునేందుకు జీలం నదిలోకి దూకి జలసమాధి అయిపోయారు”
జస్టిన్ కధనం ప్రకారం : “యుద్ధం ప్రారంభంలోనే పురుషోత్తముడు అలెగ్జాండర్‌తో ఒంటరిగా పోరాడాలనే కోరికను వెలిబుచ్చుతాడు. దీని ద్వారా రక్తపాతం జరగకుండా చూడవచ్చని అతని ఆలోచన. దీనిని అలెగ్జాండర్ అంగీకరించడు. యుద్ధం ప్రారంభంలోనే అలెగ్జాండర్ గుర్రం చనిపోతుంది. కిందపడిన అతడిని గ్రీకుసైనికులు తీసుకుపోతారు.’’
యుద్ధంలో పురుషోత్తమునికి అతని ఏనుగులు సహకరించకపోవడం వల్ల, ఆ ఏనుగులు అతని సైనికులనే చంపివేయడం వల్ల పురుషోత్తమునికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని మన పాఠ్యపుస్తకాల్లో చెప్తారు. కానీ ఇది తప్పు. ఏనుగుల వలన ఇంత ఇబ్బంది ఉంటుందని తెలిస్తే ఎవరైనా సరే తమ సైన్యంలో గజబలాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు?
కుర్టియస్, డయోడరస్ కథనం ప్రకారం- “పురుషోత్తమునికి అతని ఏనుగులు చాలా ఉపకరించాయి. అలెగ్జాండర్ సైనికులలో అత్యధిక భాగం పురుషోత్తముని ఏనుగుల చేత చంపబడ్డారు”.
ఇథియోపియాకి చెందిన ఇ.ఎ.డబ్ల్యు.బ్యాడ్జ్ తన ‘ది లైఫ్ అండ్ ఎక్స్‌ప్లాయిట్స్ ఆఫ్ అలెగ్జాండర్’ అన్న పుస్తకంలో ఇలా వ్రాస్తాడు: “జీలం యుద్ధంలో అలెగ్జాండర్‌కు చెందిన అశ్విక దళంలో అధిక భాగం హతమైంది. ఒక సందర్భంలో యుద్ధం చేయబోమని అలెగ్జాండర్ సైనికులు ఎదురు తిరుగుతారు. యుద్ధం కొనసాగితే తనకు కూడా చావు తప్పదని గ్రహించిన అలెగ్జాండర్ పురుషోత్తమునితో సంధి చేసుకుని తన రాజ్యంలోని కొన్ని భాగాలను పురుషోత్తమునికి అప్పచెప్తాడు.’’
అలెగ్జాండర్ పురుషోత్తమునితో సంధి ప్రయత్నాలు చేసినట్టు చాలామంది ఐరోపా చరిత్రకారులు రాయగా మన పాఠ్యపుస్తకాలలో మాత్రం పురుషోత్తముడే అలెగ్జాండర్‌తో సంధి చేసుకున్నాడని ఉంది. సంధి చేసుకున్న తరువాత అలెగ్జాండర్ సింధ్, మర్కన్ గుండా తిరుగుప్రయాణం కడతాడు. అప్పటికే యుద్ధంలో తీవ్రంగా గాయపడిన అలెగ్జాండర్ క్రీ.పూ 323లో బాబిలోనియాలో మరణించాడు.  అది నాటి కథ. మరి నేడో? అలెగ్జాండర్‌ని విశ్వవిజేతగా పొగుడుతూ మన పిల్లలకి చెప్తున్నాం. ఎంత అవమానకరమైన విషయమిది?
అలెగ్జాండర్ తరువాత మన దేశం మీదకి దండెత్తి వచ్చిన సెల్యుకస్‌ని చంద్రగుప్తుడు ఓడించాడు. చంద్రగుప్తుని పరాక్రమానికి ఆశ్చర్యపోయిన సెల్యుకస్ అతనితో బంధుత్వం నెరపాడు.
పవిత్ర మాతృభూమిపై యవనుల దురాక్రమణలో యవనులను సింధునది ఆవలకు పారదోలి, దేశ సమైక్య సాధనకై అశ్వమేధ యాగాన్ని చేసిన వీరుడు “పుష్యమిత్రుడి” జీవితగాధ మన జాతకిి మార్గదర్శనం.
మట్టిబొమ్మలను మహావీరులుగా మలచి మన దేశంపైకి దండెత్తి వచ్చిన వారిని తరిమికొట్టి నవశకానికి నాంది పలికిన శాతవాహనుడు, దేశ సమగ్రతను కాపాడడం కోసం విదేశీయులతో చేతులు కలపక వారినెదిరించిన ఖారవేలుడు, భారతదేశం వెలుపల హిందూ సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేసిన శైలేంద్రుడు, మన దేశాన్ని ఆక్రమించిన హూణులను ఓడించి తరిమికొట్టిన యశోధర్ముడు, 8వ శతాబ్దంలో చైనానుండి వచ్చిన దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టిన కాశ్మీర్ చక్రవర్తి లలితాదిత్యుడు- వీరందరి సాహస గాధలను విన్నప్పుడు మన హృదయాలు ఉత్సాహంతో ఉరకలు వేస్తాయి.
బాగ్దాద్ నుండి మన దేశం మీదకి దండెత్తి వచ్చిన మహ్మద్ బీన్ కాశింతో సింధ్ ప్రాంతంలోని దాహిర్ రాజులు పోరాడారు. ఒక్కరు కూడా వెన్ను చూపలేదు. దాహిర్ రాజు చనిపోతే దాహిర్ రాణి నాయకత్వంలో వేలాదిమంది మాతృమూర్తులు విధర్మీయులతో పోరాడి ధర్మరక్షణ కోసం ప్రాణత్యాగం చేసారు.
గజనీ మహమ్మద్, బందేలుఖండ్‌ని పాలిస్తున్న విద్యాధరుని చేతిలో ఘోరంగా ఓడిపోయి పలాయనం చిత్తగించాడు. అలాంటి విద్యాధరుని గురించి మన చరిత్రలో ఒక్క ముక్క కూడా చెప్పరు.
క్రీశ 1035లో గజనీ మేనల్లుడు సాలార్ మసూద్ లక్షా 50 వేల మందితో దండెత్తి వస్తే పాశీరాజులు ఇద్దరిని తప్ప మిగిలిన అందరినీ చంపేసారు. జరిగిన విషయం వాళ్ల రాజుకి చెప్పడం కోసం ఆ ఇద్దరినీ వదిలేసారు.
బాగ్దాద్ వరకు భారతీయ సామ్రాజ్యాన్ని వ్యాపింపచేసిన బాప్పారావల్ శౌర్యం మనకి స్పూర్తిదాయకం.
1178లో మహమ్మద్ ఘోరీ గుజరాత్‌పై దండెత్తాడు. గుజరాత్ రాజు బాలుడైనందున అతని తల్లి నాయకీదేవి సైన్యానికి నాయకత్వం వహించి అబూ పర్వతం సమీపంలో ఘోరీని ఓడించింది. మరి ఆ వీరవనిత నాయకీదేవి గురించి మన చరిత్రలో లేదు.
మనం పిల్లలకి బోధించాల్సింది కల్పితాలతో కూడిన అక్బర్ గొప్పదనం గురించి కాదు. అతనికి ఏనాడూ తలవంచని రాణాప్రతాప్ స్వాభిమానాన్ని గురించి చిన్నారులకు చె ప్పాలి. పరమ క్రూరుడైన ఔరంగజేబుకు మహారాష్టల్రో శివాజీ నుండి, అస్సాంలో లాచిత్ బడ్ ఫుకన్ (అస్సాం శివాజీ) నుండి, పంజాబ్‌లో గురు గోవింద్ సింగ్ నుండి నిరంతరం ఎదురుదెబ్బలు తగులుతునే ఉన్నాయి. 10, 11 ఏళ్ల పసిప్రాయంలోనే ధర్మం కోసం ప్రాణాలర్పించిన గురుగోవిందుని కుమారులు ఫతేసింగ్, జొరావర్‌సింగ్‌ల బలిదానం అత్యంత ప్రేరణదాయకం.
మొఘలుల దురాక్రమణను ఎదిరించి నిలిచిన వీరవనిత, వింద్య ప్రాంతాలలో ఉన్న గఢ్‌మల్ రాజ్యానికి రాణి అయిన దుర్గావతి, ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్, రాణి చెన్నమ్మ, రాణి రుద్రమదేవి మొదలైన మాతృమూర్తుల శౌర్యం మనకు చైతన్యాన్నిస్తాయి.
సుదీర్ఘకాలం మన దేశంలో అధికారం చెలాయించిన మొఘలులు దక్షిణ భారతదేశానికి తమ రాజ్యాన్ని విస్తరింపచేయలేక పోయారంటే దానికి కారణం దక్షిణ భారతంలో విజయనగర సామ్రాజ్యం ఉండడమే.
ఈ విధంగా అసంఖ్యాకంగా ఉన్న మన వీరుల గాధలు వింటుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. మనది సంఘర్షణ ప్రవృత్తి. భారతీయులు ఏనాడూ ఎవరికీ తలవంచలేదు. అటువంటి సాహసమయ సంఘర్షణ ప్రవృత్తి మన విద్యార్థులలో నిర్మాణం కావాలి. ఇది జరగాలంటే మనదైన చరిత్ర బోధన జరగాలి. ఇందుకోసం మన విద్యావిధానంలో తగు మార్పులు చేయాలి.
(ఈ వ్యాసం ఆంధ్రభూమి దినపత్రికలో జూన్ 2, 2017లో ప్రచురితమయింది)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.